Sunday, March 19, 2017

ఆవేదనాక్షరాస్త్రాలు..




ఆవేదనాక్షరాస్త్రాలు.. 
*************


"మానవత్వం"
మార్చేసిన తత్వం మనది.. 
"దానగుణం"
రూపుమాపిన గుణం మనది..
"సహాయం"
చెయ్యగలిగినా చెయ్యని నిస్సహాయుత మనది..
"ఆదరణ"
దరి చేరని ఆ .... "దరణ" మనది.. !!
ఇలాంటి పదాలన్నీ చదువుకోవడానికి, 
వినడానికి మాత్రమే బాగుంటాయ్ .. 
కడుపు కాలి ఒకడు ఏడుస్తుంటే, 
పకోడీ తింటూ చూసేవాడొకడు ..!!
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, 
ముసుగుదన్ని "ఎసి" లో పడుకునేటోడొకడు.. !!
చిన్నారుల ఆకలి, కేకలతో..
పాడిపశువుల రక్త మాంసాలతో.. 
రైతు కుటుంబాల ఆర్తనాదాలతో .. 
కుల, మత, ప్రాంతీయ కొట్లాటలతో..
అతివల మాన, ప్రాణ శోకాలతో..
భ్రూణహత్యల పాతకములతో.. 
శోకిస్తోంది, తల్లడిల్లుతోంది 
నా పుడమితల్లి.. !!
జరిగిపోయిన చరిత్రలు మనవారివి.. 
జరుగుతున్న బ్రతుకులు మనవి.. 
మారని రాతలు ముందుతరాల వారివి.. !!
ఈ రాక్షస రాజ్యంలో, 
రక్తాన్ని జుర్రుకునే పాలకుల మధ్యన 
ప్రజలు ఓ జీవం వున్న నిర్జీవ శవాలు.. !!
నరుల కన్నీరు నిత్యం ధారలా ప్రవహించే అశ్రునది నా ఈ ధరణి ..!!
అది ఎన్నటికీ ఎండదు.. మా బానిస బ్రతుకుల్లో మార్పు వుండదు.. 
మన సమాధులపై నిర్మించే ఎత్తైన భవనాలలో, 
ధనికులు, పాలకుల వికటాట్టహాసాలు గావిస్తుంటే .. 
ఘర్మజలం చిందించే కార్మికుల రక్తంతో 
వెలుఁగొందు రంగు రంగుల నిర్మాణ సౌధాలు ...!!
ఎప్పటికి ఆరేను ?? ఏనాటికి ఆగేను ??
భగ భగ మండుతున్న పేదవాని చితులు...!!
కనపడుతుందా.. !!
వినపడుతుందా..!!
ఓయ్ నిన్నే ..
టపాలకు, టపాలు ముఖపుస్తకంలో 
రాసెయ్యడం కాదు.. 
ఓసారి వారి దుర్భర పరిస్థితులను చూడు.. 
బయటకు వచ్చి కాస్త వాస్తవాన్ని గమనించు .. 
నాలుగు గోడలమధ్యన కనపడేవి నిజాలు కాదు.. 
నలుగురు మనుషులు చెప్పే కన్నీటి ఆనవాళ్ళే నిజాలని తెలుసుకో .. !!
వారిపై వ్రాయి, 
వారి శ్రేయస్సుకొరకు వ్రాయి..
కదిలే నీ కలానికి కాస్త "పేదవాని అశ్రువులు" ఊతమివ్వు.. 
అప్పుడు నేను చెప్పేదేంటి.. 
నీ హృదయ లోలోతుల్లో నుంచి ఉబికి వస్తాయి.. 
నీ ఆవేదనాక్షరాస్త్రాలు.. 
శిఖండుల పాలిట మారణాస్త్రాలుగా.. 
పేదల పాలిట పన్నీటి ఝల్లులుగా.. 
వ్రాయి.. వాస్తవాలు వ్రాయి.. 
తెలిసింది వ్రాయకు.. తెలుసుకొని వ్రాయి.. 
సామాన్యుని ఆయుధం కలమని నిరూపించు.. 
నీ అక్షరం అవ్వాలి ... 
కన్నీరు చిందించని లక్షణం లా.. 
వికసించే విలక్షణం లా.. 

Written by : Bobby

2 comments:

  1. వాస్తవాలు రాయి
    తెలిసింది రాయకు
    తెలుసుకొని రాయి
    కలమే ఆయుధమని నిరూపించు.. భలేగా రాసారు.

    ReplyDelete